Republic Day 2025 : 76వ గణతంత్ర వేడుకలకు భారత్ సిద్ధమవుతోంది. జనవరి 26, 2025 నుంచి ప్రారంభమయ్యే ఈ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రోజున దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పత్ లో ఉదయం 10 గంటల నుంచి రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభిస్తారు. ఈ కవాతును చూసేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కొన్ని విషయాలు తెలుసుకోవడం, తెలియజేయడం చాలా ముఖ్యం.
ప్రజాస్వామ్యం – గణతంత్రం మధ్య తేడాలివే
భారతదేశం జనవరి 26, 1950న రిపబ్లిక్‌గా అవతరించింది. అంతేకాదు మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చాలా మందికి తెలిసే ఉంటుంది. యావత్ ప్రపంచంలోనే మానవీయ విలువలను, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబింప చేసే అద్భుతమైన రచనగా మన రాజ్యాంగానికి పేరుంది. మన దేశం ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. అయితే చాలా మందికి ప్రజాస్వామ్యం – గణతంత్రం మధ్య తేడా ఏమిటో ఇప్పటికీ తెలియకపోవచ్చు. అలాంటి వారు ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు.
ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు చాలా ఉన్నప్పటికీ అవి రిపబ్లిక్ కాదు. నార్వే, స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, స్పెయిన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. భారతదేశం, అమెరికా, లావోస్, కాంగో, దక్షిణాఫ్రికా, ఉరుగ్వే వంటి దేశాలు ప్రజాస్వామ్య గణతంత్రాలు. కానీ మన దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం. కావున, ప్రజాస్వామ్యం – గణతంత్రం మధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రజాస్వామ్యం అనే ఆంగ్ల పదం డెమోక్రషియా (Demokratia) అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. డెమోస్ (Demos) అంటే ప్రజలు, క్రాటోస్ (Cratose) అంటే శక్తి. ఈ రెండు పదాలను కలిపితే ప్రజాస్వామ్యం (డెమోక్రసీ) అనే పదం ఏర్పడుతుంది. ప్రపంచంలోని మొట్టమొదటి ప్రజాస్వామ్యంగా పురాతన గ్రీకు నగరం ఏథెన్స్ పేరు గాంచింది. దీన్ని 507 BCలో స్థాపించారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యంలో చట్టాలు చేయడానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ప్రజలకు హక్కులు కలిగించే ప్రభుత్వ వ్యవస్థ అని చెప్పవచ్చు. పాలన చట్టబద్ధంగా ఉంటుంది. ఏ వ్యక్తితీ సేదా సమూహానికి ప్రత్యేక హోదా ఉండదు.
రిపబ్లిక్ విషయానికొస్తే ఇది లాటిన్ పదం Res Publica అనే పదం నుంచి వచ్చింది. అంటే ప్రజాపాలన అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే రిపబ్లిక్ అనేది దేశాన్ని ప్రజా వ్యవహారంగా పరిగణించే ఓ ప్రభుత్వ వ్యవస్థ. ఇందులో బ్రిటీష్ రాజు లేదా రాణికి ఉన్నట్టు వారసత్వ అధికారం ఉండదు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజలే నిర్ణీత కాలానికి ఓ వ్యక్తిని ఎన్నకుంటారు.
ముఖ్యమైన తేడాలివే
- ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థలో, అన్ని చట్టాలు మెజారిటీ ప్రజాప్రతినిధులు రూపొందిస్తారు. కానీ రిపబ్లికన్ ప్రభుత్వంలో, చట్టాలను దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రూపొందిస్తారు.
- ప్రజాస్వామ్య వ్యవస్థలో, మెజారిటీకి ఉన్న హక్కులను రద్దు చేసే హక్కు ఉంటుంది. కానీ రిపబ్లికన్ వ్యవస్థలో మాత్రం రాజ్యాంగమే హక్కులను పరిరక్షిస్తుంది.
- రెండింటి మధ్య మరో వ్యత్యాసం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకే అధికారం ఉంటుంది. అయితే రిపబ్లిక్‌లో అధికారం వ్యక్తిగత పౌరులకు మాత్రమే ఉంటుంది.
- ప్రజాస్వామ్యం ప్రధానంగా సామాన్య ప్రజల అభీష్టంపై దృష్టి పెడుతుంది. రిపబ్లికన్ వ్యవస్థలో, రాజ్యాంగంపై ఎక్కువ దృష్టి పెడుతుంది.
- ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వంపై ఎలాంటి పరిమితులు ఉండవు. అయితే గణతంత్ర వ్యవస్థలో మాత్రం రాజ్యాంగం ద్వారా ప్రభుత్వంపై పరిమితులు విధిస్తారు.
Also Read : Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ – కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
మరిన్ని చూడండి