BJP Appoints Elections Incharges: లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు చోట్లా బీజేపీయే గెలిచింది. మరి కొద్ది నెలల్లో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హైకమాండ్ ఈ ఎలక్షన్స్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. మహారాష్ట్రకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా భూపీందర్ యాదవ్‌ని, కో ఇన్‌ఛార్జ్‌గా అశ్వినీ వైష్ణవ్‌ని నియమించింది. హరియాణాలో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ధర్మేంద్ర ప్రదాన్‌తో పాటు బిప్లవ్ కుమార్ ఎంపికయ్యారు. ఝార్ఖండ్‌లో ఎన్నికల ఇన్‌ఛార్జ్ పదవిని శివరాజ్ సింగ్ చౌహాన్‌కి అప్పగించింది హైకమాండ్. ఆయనతో పాటు హిమంత బిశ్వ శర్మకీ ఈ బాధ్యతలు కట్టబెట్టింది. జమ్ముకశ్మీర్‌కి తెలంగాణ బీజేపీ నేత జి కిషన్‌రెడ్డిని నియమించింది అధిష్ఠానం. ఇటీవలే కిషన్ రెడ్డికి కేబినెట్‌లోనూ చోటు కల్పించింది. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక బాధ్యతనూ అప్పగించింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने आगामी विधानसभा चुनाव- महाराष्ट्र, हरियाणा, झारखंड एवं जम्मू कश्मीर के लिए प्रदेश चुनाव प्रभारी एवं सह-प्रभारियों की नियुक्ति की है। pic.twitter.com/L4SbOrVrbI
— BJP (@BJP4India) June 17, 2024
మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్‌లో మాత్రం ఈ సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ పట్టు కోల్పోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 13 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ మాత్రం 28 చోట్ల పోటీ చేసి కేవలం 9 స్థానాల్లో గెలుపొందింది. మహావికాస్ అఘాడియా 48 కి గానూ 30 సీట్‌లు గెలుచుకుంది. అయితే…మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీజేపీనే గెలిపిస్తారని, మహావికాస్ అఘాడియా కూటమి ఏ అభివృద్ధి చేయదని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక హరియాణా విషయానికొస్తే…ఇక్కడ బీజేపీ 10 సీట్లకు గానూ 5 స్థానాలు సొంతం చేసుకుంది. 2019లో మొత్తం క్లీన్ స్వీప్ చేసినా ఈ సారి మాత్రం వెనకబడింది. హరియాణాలో పట్టు నిలుపుకోవడంపై కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.
మరిన్ని చూడండి