Ram Mandir Pran Pratishtha:
అయోధ్య ఉత్సవం రోజున సెలవు..
అయోధ్య ఉత్సవాన్ని పురస్కరించుకుని (Ram Mandir) పలు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్‌కి అధికారికంగా సెలవు ప్రకటించాయి. జనవరి 22న పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేశాయి. ప్రాణప్రతిష్ఠ (Ram Temple Pran Prathishtha) కార్యక్రమాన్ని అందరూ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. స్కూళ్లతో పాటు అన్ని సంస్థలకూ ఆ రోజు సెలవు ఇచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ అపురూప వేడుకను అందరూ జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. ఇప్పటికే అయోధ్యలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రాణప్రతిష్ఠకు ముందు జరగాల్సిన కీలక పూజలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ వేడుక అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని యూపీ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అందుకే..జనవరి 22న పబ్లిక్ హాలిడే ప్రకటించింది.
ఉత్తర్‌ప్రదేశ్
రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజంతా మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి.
మధ్యప్రదేశ్
జనవరి 22న స్కూళ్లకు సెలవు ప్రకటించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాలిచ్చారు. ఆ రోజు ప్రజంలదరూ ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఆ రోజు డ్రై డే గా ప్రకటించారు. అన్ని లిక్కర్ షాప్స్ మూసేయాలని తేల్చి చెప్పారు.
గోవా
జనవరి 22న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని స్కూల్స్‌కీ సెలవు ప్రకటించింది గోవా ప్రభుత్వం. అయోధ్య ఉత్సవం సందర్భంగా అందరూ ఈ వేడుక జరుపుకోవాలని సూచించింది. సెలవు డిక్లేర్ చేస్తున్నట్టు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్
జనవరి 22న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటన చేశారు.
“ఇప్పుడు అంతటా రామనామమే మారుమోగుతోంది. అయోధ్య ఉత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 22న అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం”
– విష్ణు దేవ్‌సాయి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి
హరియాణా
అటు హరియాణా ప్రభుత్వం కూడా జనవరి 22న సెలవు ప్రకటించింది. మద్యం దుకాణాలు తెరవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
అయోధ్య ఉత్సవానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే (Indian Railways) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా రైళ్ల రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైల్వే ట్రాక్ డబ్లింగ్ (సింగిల్ ట్రాక్ డబ్లింగ్), విద్యుదీకరణ పనులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 16 నుంచి 22 వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసింది. డూన్ ఎక్స్‌ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించింది. పనులు వేగంగా పూర్తి చేసి రామమందిరం ప్రారంభానికి అందుబాటులోకి తీసుకొచ్చేలా శరవేగంగా పనులు చేపడుతోంది.
Also Read: Rs 500 Note: శ్రీరాముడు, అయోధ్య ఆలయం చిత్రాలతో కొత్త రూ.500 నోట్లు!?