Maha Kumbh 2025 : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళా 2025కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. కోట్ల సంఖ్యలో భక్తులు, సాధువులు, సన్యాసులు మేళాలో పాల్గొని, పవిత్ర గంగా నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్ కమిషనరేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 28 వరకు కొన్ని విషయాలపై నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. కుంభమేళాకు వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని పనులు చేయాలంటే ఖచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని ఆదేశించింది. వీటిలో ఊరేగింపులు లేదా నిరసనలు, డ్రోన్ల వాడకం, ఆయుధాలు కలిగి ఉండటం, ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయడం, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయడం లాంటివి ఉన్నాయి.
ఈ పనులు చేయాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి
పోలీసు కమిషనరేట్ జారీ చేసిన ఉత్తర్వులో.. అధికారుల అనుమతి లేకుండా ఏ వ్యక్తి ఎలాంటి కార్యక్రమాలు, ఊరేగింపులు, నిరాహార దీక్షలు, ధర్నాలు లాంటి గుమికూడే తదితర కార్యక్రమాలను నిర్వహించకూడదని, రహదారిని అడ్డుకోవద్దని పేర్కొంది. దాంతో పాటు ప్రయాగ్ రాజ్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఎవరూ ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ లను వినియోగించరాదు. పోలీసులు, ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించే డ్రోన్‌లకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఉంటుంది.
మారణాయుధాలపై నిషేధం
ప్రయాగ్‌రాజ్ కమిషనరేట్ పరిధిలో ఏ వ్యక్తి కర్ర లేదా ఇతర ఏదైనా రకమైన తుపాకీ వంటి మారణాయుధాలు తీసుకురాకూడదు. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ పనిలో నిమగ్నమైన ఉద్యోగులు, అధికారులకు మాత్రమే ఈ పరిమితి నుండి మినహాయింపు ఉంటుంది. లైసెన్స్ పొందిన తుపాకీలతో సహా ఏ ఆయుధంతోనూ జిల్లాలోని ఏ ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు/ఆవరణలోకి ప్రవేశం ఉండదు. ఏ వర్గాన్ని/సంఘాన్ని లేదా వ్యక్తిని బాధపెట్టే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాన్ని ఎవరూ ఇవ్వరాదని, ఏ వ్యక్తి/సంఘం మనోభావాలను దెబ్బతీసేలా ప్రకటనలు/కరపత్రాలను ప్రచురించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయరాదు
పోలీసు ఆదేశం ప్రకారం, ఏ వ్యక్తి అయినా సామాజిక మాధ్యమాలు లేదా మరే ఇతర మాధ్యమం ద్వారా ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయరాదు. ఇది శాంతికి విఘాతం కలిగించవచ్చు లేదా మరే ఇతర కమ్యూనిటీ మతపరమైన మనోభావాలను దెబ్బతీయరాదు. తప్పుదారి పట్టించే లేదా రెచ్చగొట్టే లేదా సున్నితమైన పోస్ట్/కథనాలను చేయకూడదు, ఫొటోలు ఫార్వార్డ్ చేయరాదు.
యూపీఎస్ఆర్టీసీ బస్సులకూ..
సాధారణ ప్రజలకు గందరగోళం లేదా బాధ కలిగించే ఆడియో/వీడియో క్యాసెట్‌లు, సీడీలను బస్సుల్లో ప్లే చేయడం లేదా ప్రదర్శించడం చేయరాదు. ఎవరూ ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదు. ఈ ఉత్తర్వుల ప్రకారం పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు, దుకాణాలు మొదలైనవాటిని ఎవరూ బలవంతంగా మూసి వేయకూడదు. ప్రభుత్వ కార్యాలయాలు, కర్మాగారాలు, మిల్లులు మొదలైన వాటి సాధారణ పనితీరులో ఎలాంటి అంతరాయాన్ని కలిగించరాదు. పోలీసుల ఆదేశం ప్రకారం, యూపీఎస్‌ఆర్‌టీసీ బస్సులు, ఇతర వాహనాలను ఎవరూ రోడ్లపై ఆపకూడదు. ఎవరూ ఇతర వాహనాలను పాడు చేయకూడదు. ఏ వ్యక్తీ పబ్లిక్ రోడ్డుపై అడ్డంకులు సృష్టించకూడదు, ట్రాఫిక్ ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలిగించకూడదు.
Also Read : Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు 6 రోజుల్లోనే 7 కోట్ల మంది భక్తులు – ఆర్థికంగా బలపడుతోన్న యూపీ
మరిన్ని చూడండి