Assam CM: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి కి ప్రభుత్వం నుంచి రూ. 10 కోట్ల సబ్సిడీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇది అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని అస్సాం కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై హిమంత బిశ్వ శర్మ స్పందించారు. కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తన భార్యకు కానీ, తన భార్య కంపెనీకి గానీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీని రాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. ‘భారత దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సంపద పథకాన్ని ప్రారంభించారు. కానీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తన అధికారాన్ని ఉపయోగించి తన భార్య సంస్థకు క్రెడిట్ సబ్సిడీలో భాగంగా రూ. 10 కోట్లు పొందేందుకు సహాయం చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకాలు బీజేపీని సంపన్నం చేయడానికేనా?’ అని గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు.
I would like to clarify that neither my wife nor the company she is associated with has ever received any financial subsidies from the Government of India https://t.co/oqGG21nEp6
— Himanta Biswa Sarma (@himantabiswa) September 13, 2023
గౌరవ్ గొగోయ్ ఈ ట్వీట్ చేయడంతో.. హిమంత బిశ్వ శర్మపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్ నేతలు అస్సాం ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. వాటిపై స్పందిస్తూ హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
‘నా భార్య లేదా ఆమె సంస్థకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక రాయితీ పొందలేదని స్పష్టం చేయాలనుకుంటున్నా’ అని అస్సాం సీఎం ట్వీట్ చేశారు.
PM Modi launched the Kisan Sampada scheme to double the income of farmers of India. But in Assam Chief Minister Himanta Biswa Sarma used his influence to help his wife’s firm get Rs 10 crore as part of credit linked subsidy. Are Central government schemes meant to enrich BJP ? pic.twitter.com/ITqzrBCe4c
— Gaurav Gogoi (@GauravGogoiAsm) September 13, 2023
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ట్వీట్టర్ వేదికగా ఆరోపణ చేస్తూ.. ఓ పత్రాన్ని పోస్టు చేశారు. ఒకవేళ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ హ్యాక్ కు గురైతే.. ఆ విషయాన్ని అస్సాం సీఎం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని గొగోయ్ ఎద్దేవా చేశారు. రినికి కి చెందిన సంస్థ పేరు ఆ పత్రంలో స్పష్టంగా కనిపిస్తుందని. రూ. 10 కోట్ల ప్రభుత్వ గ్రాంట్ వచ్చినట్లు పత్రంలో చూడొచ్చని గొగోయ్ ట్వీట్ చేశారు.
‘ముఖ్యమంత్రి సౌలభ్యం కోసం నేను ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లింక్ ను జత చేస్తున్నాను. ఇది రూ. 10 కోట్ల ప్రభుత్వ సబ్సిడీ పొందిన కంపెనీలు, ప్రమోటర్ల జాబితా ఉంది. దయచేసి సీరియల్ నంబర్ 10 చూడండి’ అని గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేశారు. ఈ పత్రంలో హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మకు చెందిన ప్రైడ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేటె లిమిటెడ్ ను ఏపీసీ స్కీమ్ కింద అగ్రో-ప్రాసెసింగ్ క్లస్టర్ ప్రాజెక్టులో ఒకటిగా చేర్చారు.